దేశంలో అమ్మవారికి సంబంధించి చాలా చెప్పుకోదగిన ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో మానసా దేవి ఆలయం కూడా ఒకటి. హరిద్వార్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాలిక్ కొండలలోని బిల్వ పర్వతంలో మానస దేవికి సంబంధించిన ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడే సతీదేవి మెదడు పడిపోయిందట. ఇక్కడ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలే కానీ కోరిన కోరిక తప్పక నెరవేరుతుందని నమ్మకం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సాగర మథనంలో అమృత బిందువులు పడిన నాలుగు ప్రదేశాలలో హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం ఒకటి.
క్షీరసాగర మథనంతో వచ్చిన అమృతం కాస్త ఒలికి ఆ బిందువులు హరిద్వార్‌తో పాటు ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ ప్రాంతాలలో పడ్డాయని చెబుతారు. ఇక్కడ మానసాదేవి పీఠం ఏంటో తెలుసా? పాము, తామరపువ్వులు. అమ్మవారు పామును పీఠంగా చేసుకున్నందున నాగ దేవత, వాసుకి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా అమ్మవారిని ఏడు పాములు ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయట. మనకు ఏదైనా పాము కాటు వేసినా కూడా మానసాదేవిని పూజిస్తే సమస్య నుంచి గట్టెక్కుతామని నమ్మకం. ఇక ఇక్కడకు వచ్చే భక్తులు తమ కోరికను నెరవేర్చమంటూ అక్కడి చెట్టు కొమ్మలకు దారాన్ని కడుతూ ఉంటారు. కోరిక తీరిన వెంటనే ఆలయానికి వెల్లి చెట్టుకు కట్టిన దారాన్ని విప్పేస్తారు.