ఏడుపాయల వనదుర్గా క్షేత్రం గురించి తెలంగాణలో తెలియని వారుండరు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నాగసానిపల్లి గ్రామంలో ఏడు పాయల నది ఒడ్డున దుర్గమ్మ వెలిసింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఏడుపాయల వనదుర్గా క్షేత్రాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని ప్రతీతి. వనదుర్గ ఆలయం ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఇక్కడి దుర్గాదేవి అమ్మవారు మహాశక్తి అవతారంగా దర్శనమిస్తోంది. ఈ క్షేత్రం మెదక్ జిల్లా,పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఉంది. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి.
ఇక్కడ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. అక్టోబర్ 3 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. వనదుర్గ భవాణి మాత దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీశైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) అవతారంలో దర్శనమివ్వనుంది. రెండో రోజు బ్రహాచారిని (గాయత్రీ దేవి)గా.. మూడో రోజు చంద్ర గంట (అన్నపూర్ణ) అవతారంలో నాలుగో రోజు అంటే అక్టోబర్ కూష్మాండ (వనదుర్గా)గా.. ఐదో రోజు కనక దుర్గాదేవి స్కంద మాత (మహాలక్ష్మి)గా.. ఆరో రోజు షష్టి కాత్యాయని (సరస్వతిదేవి)గా.. ఏడో రోజు కాల రాత్రి (దుర్గాదేవి)గా .. ఎనిమిదవ రోజు సిద్ధి రాత్రి (మహిషాసురా మర్ధిని) అవతారంలో.. తొమ్మిదవ రోజు మహాగౌరిగా దశమి (విజయదశమి) రాజరాజేశ్వరీదేవీగా ఏడుపాయల వనదుర్గ దేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.