శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో శాస్త్రక్తంగా సింధూరార్చన.. ముగిసిన ఉత్సవాలు

తిరుమ‌ల‌లోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థల‌మైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో నిన్నటితో ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 1వ తేదీన ఆంజనేయస్వామివారి జన్మదినం కావడంతో ఆ రోజు నుంచి స్వామివారికి రోజుకో రకమైన అభిషేకం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ఉత్సవాలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. బుధవారం ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్రమైన‌ సింధూరార్చన అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ బాలాంజనేయ స్వామి వారికి పుష్ప, తులసి అర్చన జరిగింది.

ఈ సందర్భంగా టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు సింధూరం ధరించిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కీర్తి గడిస్తారని, సింధూరార్చన విశిష్టత, హనుమత్ వైభవము, అంజనాద్రి పర్వతం గురించి వివరించారు. అనంతరం బాలాంజనేయ స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రానికి పంచామృత స్నప‌న తిరుమంజ‌నం ఆలయ అర్చకులు శాస్త్రక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఐదు రోజులపాటు ఆకాశగంగలో విశేషంగా నిర్వహించారు. శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలను ఐదు రోజుల పాటు నిర్వహించారు.

Share this post with your friends