ఏ ఆలయానికి వెళ్లినా మూలవిరాట్టు ఎక్కడుంటాడు? గర్భగుడిలోనే కదా కొలువై ఉంటాడు. అలాంటిది అక్కడి సరస్వతీ దేవి మాత్రం పచ్చని ప్రకృతి మధ్యలో దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటారా? కేరళ కొట్టాయంలోని పనచ్చిక్కాడు గ్రామంలోఉంది. ఇక్కడి అమ్మవారు ఓ చిన్న కొలనులో ఉంటుంది. సరస్వతీ దేవిని తాకేందుకు ఆ చిన్న కొలనులో నీరు నిత్యం ఊరుతూనే ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయి. ఈ అమ్మవారిని దక్షిన మూకాంబికగా భక్తులు పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్ని రంగాలకు చెందిన కళాకారులు దేశం నలుమూలల నుంచి అమ్మ అనుగ్రహం పొందేందుకు వస్తుంటారు.
ఈ గుడికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందట. స్థల పురాణం ప్రకారం.. ఒకప్పుడు కిళప్పురం ఇల్లం నంబూద్రి అనే భక్తుడికి మగసంతానం కలగకపోవడంతో కాశీకి వెళ్లి గంగలో స్నానం చేస్తే అబ్బాయి పుట్టొచ్చనే ఉద్దేశంతో తీర్థయాత్ర మొదలుపెట్టాడట. ఈ క్రమంలోనే ఇక్కడి సరస్వతీ దేవి ఆలయానికి వచ్చాడట. ఈ ప్రాంతం నంబూద్రికి బాగా నచ్చిందట. ఇక్కడే ఉండి నిత్యం అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నాడట. ఒకరోజు అమ్మవారు కలలోకి వచ్చి అతడికి మగ సంతానం కలగదని చెప్పిందట. అలాగే అతడి ఊళ్లో ఓ స్త్రీ ఇద్దరు పిల్లల్ని కంటుందని.. వారిలో ఒకరిని దత్తత తీసుకోమని చెప్పిందట. అమ్మ చెప్పిన ప్రకారం ఊరు వెళదామని బయలుదేరి ఓసారి ఆలయంలోని పుష్కరిణిలో స్నానం చేయాలనుకుని తన దగ్గరున్న తాటాకుల గొడుగును మెట్లపైన పెట్టాడట. స్నానం చేసి వచ్చి గొడుగు తీయబోతే ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోయాడట. ఓ స్వామిజీ వచ్చి ఆ గొడుగులో అమ్మవారి శక్తి ఉందని చెప్పడంతో అలా అమ్మవారిని గుర్తించి పూజలు చేసి వెళ్లిపోయాడట. అప్పటి నుంచి అమ్మవారు అక్కడే కొలువై పూజలు అందుకుంటోందట.