ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభ మేళాలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడు ఎకరాల్లో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అచ్చం శ్రీ మలయప్ప స్వామివారిని పోలిన ఆలయం మాదిరిగా ఉండటంతో భక్తులు సైతం స్వామివారిని దర్శించుకుని ఆనందపరవశులవుతున్నారు.
శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాల తరహాలో ఉదయం తిరుప్పావై సేవ, తోమాలసేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను దర్శనాలకు అనుమతించి స్వామివారి ప్రసాదాలు వితరణ చేశారు. సాయంత్రం 4 గంటలకు నమూనా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా ఊంజల్ సేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరై స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించారు. మంగళవారం రోజు సాయంత్రం 6 గంటల వరకు 7,083 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.