యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి రికార్డ్ ఆదాయం..

యాదాద్రి ఆలయానికి గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. గిరి ప్రదక్షిణ, పుష్కరిణిని పున: ప్రారంభించడం.. వంటి వాటితో పాటు ఆలయం పునర్నిమాణం తరువాత భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో స్వామివారి ఆలయ జూలై నెల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. స్వామివారికి నెల రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించింది. స్వామివారి హుండీ ఆదాయం నగదు రూపంలో రెండున్నర కోట్లకు పైనే లభించింది. కొండ కింద ఆధ్యాత్మికవాడలోని శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో భక్తులు గత 30 రోజులుగా సమర్పించిన నగదు, నగల కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది.

గత నెల రోజులుగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.2 కోట్ల 66 లక్షల 68,787లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నగదుతో పాటు 87 గ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఇందులో అత్యధికంగా 1354 అమెరికా డాలర్లు రావడం గమనార్హం. ఇక ఇతర దేశాల కరెన్సీ విషయానికి వస్తే.. యూఏఈ దిర్హమ్స్, సౌదీ అరేబియన్ రియల్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, న్యూజిలాండ్ డాలర్స్, యూరోలతో పాటు ఇంకా పలు దేశాల కరెన్సీ వచ్చినట్టుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ అధికారులు వెల్లడించారు.

Share this post with your friends