18వ శతాబ్దపు శ్రీ వేంకటేశ్వర స్వామివారి పరమ భక్తుల్లో ఒకరైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని తిరుమలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో బుధవారం సాయంత్రం టీటీడీ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు శ్రీ భూమన్ సుబ్రమణ్యం రెడ్డి పుష్పాంజలి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంగమాంబ శ్రీ వేంకటేశ్వరుడు, తరిగొండ లక్ష్మీ నృసింహస్వామిపై గొప్ప రచనలు చేశారని అన్నారు. వెంగమాంబ ప్రాజెక్ట్ ద్వారా టీటీడీ ఆమె సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ, ప్రతి సంవత్సరం తరిగొండ, తిరుపతి మరియు తిరుమలలో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. శ్రీవారికి ఏకాంతసేవ సమయంలో అన్నమయ్య లాలి – వెంగమాంబ ముత్యాలహారతి నేటికీ కొనసాగుతున్నాయని వివరించారు.
అంతకుముందు నాద నీరాజనం వేదికపై టీటీడీ ఆస్థాన విద్వాంసులు డా. బాలకృష్ణ ప్రసాద్‌తో పాటు ప్రముఖ అన్నమాచార్య ప్రాజెక్టు గాయని శ్రీమతి బుల్లెమ్మ వెంగమాంబ రచించిన కీర్తనలను అత్యద్బుతంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ జిఎల్‌ఎన్ శాస్త్రి, వెంగమాంబ వంశీయులు, ఇతర అదికారులు పాల్గొన్నారు.