దేవాదాయ శాఖలో అవినీతి బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దేవాదాయ శాఖపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పలు నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. రూ.50వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న.. ఆలయాలకు ఆర్థిక సాయాన్ని పెంచనున్నట్టు ఆనం తెలిపారు. అలాగే దేవాదాయ శాఖను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఆ ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కానుందని ఆనం తెలిపారు. ఏ ఆలయం నుంచి అయినా ఏ చిన్న ఆరోపణ వచ్చినా కూడా నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలిపారు. ఆపై విచారణ కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలో ఐదుగురు దేవాదాయ అధికారులపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఆనం గుర్తు చేశారు. అలాగే మరో వివాదాస్పద అధికారిపై సైతం విచారణ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. దేవస్థానాలకు త్వరలో కొత్త పాలకమండళ్ల నియామకంపై సమాలోచన చేస్తున్నారు. ఆలయ భూములను పరిశీలించి ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే తొలగిస్తామన్నారు. సీజీఎఫ్ కింద 160 ఆలయాలను పునర్మిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే జల హారతులపై మంత్రుల కమిటీ ఇవాళ భేటీ కానుంది. కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం తెలిపారు.