మే 23న శ్రీ క‌పిలేశ్వరాలయంలో ప‌త్ర పుష్పయాగం.. ఆ పొరబాట్లకు ప్రాయశ్చిత్తంగా..

తిరుపతిలో శ్రీ క‌పిలేశ్వర స్వామి వారి ఆలయంలో మే 23వ తేదీన పత్ర పుష్పయాగం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందుకోసం మే 22వ తేదీన సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. ఇక 23వ తేదీన ఉదయం నుంచి స్వామివారికి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మే 23న ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వ‌ర‌కూ సోమ‌స్కంద‌మూర్తికి స్నప‌న తిరుమంజ‌నం నిర్వహిస్తారు. ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ ప‌త్ర పుష్పయాగ మ‌హోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు.

ఈ ప‌త్ర పుష్పయాగ మ‌హోత్సవంలో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి ప‌లుర‌కాల పుష్పాలు, ప‌త్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్సవం జ‌రుగ‌నుంది. గృహ‌స్తులు (ఇద్దరూ) రూ.200 చెల్లించి ప‌త్ర పుష్పయాగంలో పాల్గొన‌వ‌చ్చు. అయితే కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ ఏడాది మార్చి 1 నుంచి 10వ తేదీ వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ ఉత్సవాల్లో అర్చక ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్లకు ప్రాయ‌శ్చిత్తంగా ప‌త్రపుష్పయాగం నిర్వహిస్తున్నారు.

Share this post with your friends