ఏలూరు జిల్లాలోని కలిదిండికి మూడు మైళ్ల దూరంలో ఉన్న పాతాళ భోగేశ్వరాలయం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలోని కోనేరు వద్ద భక్తులు హరహర అంటే నీరు బుడబడమంటూ కదులుతుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. స్వామివారు కోడికూత, రోకలి పోటు వినలేనని చెప్పడంతో ఆలయాన్ని పొలాల్లోనే నిర్మించారు. ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది. అదేంటంటే.. వార్షాకాలంలో ఒకరోజు జోరున వాన కురుస్తుండటంతో ఆలయ పూజారి అర్చన నిర్వహించడం ఆలస్యమైందట.
అప్పుడు స్వామివారు తనకు నిత్యార్చన ఇంకా నిర్వహించలేదేమని.. ఆలయ ధ్వజస్థంభం పైకి ఎక్కి చూశారట. కాసేపటికి అర్చకుల రాకను గమనించి ధ్వజస్థంభంపై నుంచి దూకేశారట. ఆ సమయంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్పడినట్లు ఆలయ స్థల పురాణంలో చెబుతారు. నేటికి కూడా ఆ పాద గుర్తులను భక్తులు ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ స్వామివారికి కొన్ని ప్రత్యేక సమయాల్లో పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రతి ఏటా మాఘ బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకూ శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి వారికి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.