అక్షయ తృతీయ నాడు ఈ దానధర్మాలతో అనంత కోటి పుణ్య ఫలం..

అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్యమని చెబుతుంటారు. మరి ఏ దానాలు చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందో తెలుసా? శ్రీ నారద పురాణం ప్రకారం ప్రత్యేకంగా ఈ రోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయని తెలుస్తోంది. వీటిలో జలదానం, అన్నదానం, వస్త్రదానం వంటివెన్నో ఉన్నాయి. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని అంటారు. ఈ రోజున అన్నదానం చేస్తే కలిగే పుణ్యాన్ని వెలకట్టలేమని పండితులు చెబుతారు. ఇక అసలే ఎండాకాలం కాబట్టి నేడు చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తి తీరిస్తే కోటి రెట్లు పుణ్యం లభిస్తుందట. అక్షయ తృతీయ నాడు వస్త్ర దానం చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందట. ఇలా చేస్తే జీవితంలో వస్త్రాలకు ఏ లోటూ ఉండదట.

అలాగే ఈ రోజున ఛత్రదానం అంటే గొడుగును దానం చేసినా కూడా మన వంశమంతా దారిద్ర్యం నుంచి బయట పడుతుందట. ఇక సాధారణ దానధర్మాలే కాకుండా గంగా తీరంలో చేసే దానధర్మాల గురించి నారద మహర్షి వివరించారు. ఇవాళ గంగాతీరంలో ధాన్యం, వస్త్రాలు, ఏవైనా వస్తువులు దానం చేస్తే అవి బంగారం, రత్నాలుగా పరిగణించబడతాయట. అనంతర కాలంలో గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణుడిగా పుట్టి బ్రహ్మజ్ఞానిగా ముక్తి పొందుతాడని నారద మహర్షి తెలిపారు. ఇవాళ గంగాతీరంలో బ్రాహ్మణులకు కపిల గోదానం చేసినా కూడా నరకంలో ఉన్న పితృ దేవతలంతా స్వర్గానికి చేరుతారట. ఇక గంగాతీరంలో భూదానం చేస్తే .. దానం చేసినంత భూమిలో ఎన్ని ఇసుక రేణువులుంటాయో అన్ని వేల ఏళ్ల పాటు బ్రహ్మ, విష్ణు, శివ లోకములలో నివశిస్తారట. ఆపై తిరిగి భూమి మీద పుట్టి సప్త ద్వీపా అధిపతి అవుతారని నారదుల వారు తెలిపారు.

Share this post with your friends