చార్‌దామ్ యాత్ర కోసం భక్తులు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా తరలి వస్తున్నారు. భక్తులల రద్దీకి అనుగుణంగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తగిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటి వరకూ భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1,800 మందికి పైగా భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు అనుమతిని ఇస్తున్నారు. అలాగే స్వామివారిని రాత్రి 12 గంటల వరకూ దర్శించుకోవచ్చు. గత నెలలో 5, 54 , 671 మంది భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక చార్‌దామ్ యాత్రకు ప్రభుత్వం తిరిగి ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జూన్ రెండవ వారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ పేపథ్యంలోనే ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల రెండో వారం నుంచి రోజుకు 36 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామివారి దర్శనం ఉదయం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఏకధాటిగా దర్శనాలు మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగనున్నాయి. అనంతరం స్వామివారికి బాల భోగం సమర్పించడంలో భాగంగా 30నిమిషాల పాటు దర్శనాలకు బ్రేక్ ఉంటుంది. ఆ సమయంలో ఆలయాన్ని మూసేసి.. సాయంత్రం 4 గంటల నుంచి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు బాబా కేదార్ శృంగార దర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 4 గంటల వరకు భక్తుల పూజలు నిర్వహిస్తారు.