డ్రైఫ్రూట్స్ అలంకరణలో కనువిందు చేస్తున్న నెట్టికంటి ఆంజనేయ స్వామి

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం అనే గ్రామంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అనిఅర్థం. నెట్టెకంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామి వారి కుడివైపు ప్రొఫైల్ మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అయితే ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి.

ఈ క్రమంలోనే తొలిరోజు పుష్పాలంకరణ, రెండో రోజు గంధాలంకరణ, మూడో రోజు డ్రైఫ్రూట్స్‌ అలంకరణ, నాలుగో రోజు వివిధ రకాల పండ్లతో అలంకరణ, 108 కలశాలతో అభిషేక సేవ, ఐదో రోజు స్వర్ణ వజ్రకవచ అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. దీనిలో భాగంగా.. మూడో రోజు ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్ అలంకరణలో భక్తులకు నెట్టికంటి ఆంజనేయుడు దర్శనమిచ్చారు. ఇవాళ స్వామివారిని అర్చకులు డ్రైఫ్రూట్స్‌తో అలకరించారు. ద్రాక్ష, గోడంబి, ఖర్జూరం, చెర్రీ, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను అలంకరణకు ఉపయోగించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నేటి ఉదయం ప్రత్యేక అలంకరణ తర్వాత సుందరకాండ పారాయణం, మన్య సూక్త హోమం నిర్వహించారు వేద పండితులు. సాయంత్రం సింధూరంతో లక్ష అర్చన చేపట్టారు.

Share this post with your friends