
మనం ప్రకృతిని పూజించుకుంటాం. చెట్లను, పుట్టలను, జంతువులును పూజించుకోవడం హిందువుల సంప్రదాయం. ఇక కార్తీక మాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. వాటిలో నాగుల చవితి ఒకటి. మనం పాములను నాగ దేవతలుగా కొలిచి పూజిస్తాం. శివుడి కంఠానికి అలాగే శ్రీ మహావిష్ణువుకు శేషతల్పంగా మారిన పామును మనం నాగుల చవితి నాడు పూజించుకుంటాం. పుట్టలో పాలు పోసి నాగ దేవతను స్మరించుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది.
అయితే ఈ పండుగను నవంబర్ 4వ తేదీ జరుపుకోవాలా? 5వ తేదీన జరుపుకోవాలా? అనే విషయమై కొంత సందిగ్ధత నెలకొంది. మనం నాగుల చవితిని ప్రతి ఏటా కార్తీక మాసం శుక్ల పక్షం శుద్ధ చవితి తిథి రోజున జరుపుకుంటూ ఉంటాం. పంచాగం ప్రకారం చవితి తిథి రెండు రోజులు రావడంతో నాగుల చవితి ఎప్పుడు జరుపుకోవాలనే విషయమై కొంత గందరగోళం చోటు చేసుకుంది. కార్తీక మాస శుక్ల పక్ష శుద్ధ చవితి తిథి నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రారంభమై నవంబర్ 5 వ తేదీ రాత్రి 8.56 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ ఉండటంతో పాటు మనం ఉదయ తిథి ప్రకారం పండుగలను జరుపుకుంటాం కాబట్టి నవంబర్ 5వ తేదీన నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం 4నే జరుపుకోవాలని అంటున్నారు.
