భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో మధుకేశ్వరాలయం ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున వుండే ముఖలింగం గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి మధుకేశ్వరాలయం అనే పేరు రావడానికి ఓ కథ ఉంది. హిమాలయాలపై జరుగుతున్న వైష్ణవయాగంలో గంధర్వరాజు చిత్రగ్రీవుడు తన గంధర్వగణంతో వచ్చాడు. అక్కడ ఉండే శబరకాంతలను చూసి గంధర్వులు మనసు పారేసుకున్నారు. విషయాన్ని గ్రహించిన వాసుదేవ మహర్షి.. కోపంతో వారందరూ శబరజాతిలో జన్మించాలని శపించాడు. ఇక వారంతా శబరులుగా వారి నాయకుడిగా చిత్రగ్రీవుడు జన్మించారు.
చిత్రగ్రీవుడికి చిత్తి, చిత్కళ అనే ఇద్దరు భార్యలుండేవారు. చిత్తి, చిత్కళకు క్షణం పడేది కాదు. అయితే చిత్కళ శివ భక్తురాలు. చిత్తి అంటే చిత్రగ్రీవుడికి చాలా ఇష్టం. ఒకరోజు చిత్రగ్రీవుడితో చిత్తి ‘నీతో ఉంటే నేనైనా ఉండాలి… లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని అడగ్గా.. చిత్కళను వదిలించుకోవాలనుకుంటాడు. ఆమెను పిలిచి వాకిలిలో ఉన్న ఇప్పచెట్టు కింద రాలి పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతుకమని ఆదేశించాడు. చిత్కళ బాధపడుతూనే భర్త చెప్పినట్టుగా చేస్తుంది. అయితే విచిత్రంగా రాలిన పువ్వులన్నీ బంగారు పువ్వులుగా మారేవి. అది చూసి చిత్తి అసూయతో గొడవకు దిగగా.. దీనికి కారణం ఇప్పచెట్టేనని భావించిన చిత్రగ్రీవుడు దానిని నరకబోతాడు. అప్పుడు శివుడు రౌద్రాకారంతో ప్రత్యక్షమవుతాడు. దీంతో వివాదానికి కారణం చిత్కళేనని ఆమెను చంపేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు పరమ శివుడు వారి ముందు ప్రత్యక్ష్యమై శబరులందరికీ శాపవిమోచనం గావిస్తాడు. అక్కడ మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలిశాడు.