ఇటీవలి కాలంలో బాగా ప్రసిద్ది చెందిన ఆలయాల్లో చిలుకూరి బాలజీ టెంపుల్ ఒకటి. చిలుకూరు బాలాజీని వీసా గాడ్ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్‌కి 30 కిలోమీటర్ల దూరంలో చిలుకూరు గ్రామంలో ఈ ఆలయం ఉంది. వాస్తవానికి ఈ ఆలయం 10 – 12 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఆలయానికి వచ్చి ఓ కోరిక కోరుకుని 11 ప్రదక్షిణలు చేస్తే తప్పక కోరిక నెరవేరుతుందని నమ్మకం. కోరిక తీరిన అనంతరం గుడికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. స్థలపురాణం ప్రకారం.. భక్తుడి బాధను తీర్చేందుకు తానే స్వయంగా వేంకటేశ్వర స్వామి తరలివచ్చాడు.
ఒకప్పుడు శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకొనేవాడు. అయితే అనారోగ్యం కారణంగా ఒక ఏడాది అతను తిరుమలకు వెళ్లలేకపోయాడు. ఆ భక్తుడికి స్వామివారు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి.. తనను దర్శించుకోలేదని బాధపడవద్దని మీ సమీపంలోని అడవిలోనే తానున్నానని చెప్పి.. ఆ ప్రాంతాన్ని చూపించి స్వామివారు అదృశ్యమయ్యారు. స్వామివారు కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి అక్కడి పుట్టను తవ్వుతుండగా.. పలుగు తగిలి పుట్ట నుంచి రక్తం కారడం ఆరంభమైందట. అది చూసిన సదరు భక్తుడు కన్నీటి పర్యంతమయ్యాడట. దీంతో పాలను పోయాలని వాణి వినిపించగా.. వెంటనే అలా చేయడంతో పుట్ట నుంచి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరుని విగ్రహం బయల్పడిందట. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి, మందిరాన్ని నిర్మించారు.