పురాణాలలో కొన్ని కథనాలు చాలా ప్రాశస్త్యం పొందాయి. వాటిలో ఒకటి శ్రీకృష్ణుడి సంతానానికి సంబంధించిన కథ. ప్రపంచాన్ని తన మాయాజాలంతో స్తంభింపజేయ గల శక్తి శాలి అయిన శ్రీకృష్ణుడికి సంతానం లేకపోవడమేంటి? ఎవరో వరమిస్తే కానీ సంతానం కలగకపోవడమేంటి? నిజంగా ఇది ఆసక్తికరమే. శ్రీకృష్ణుడికి సంతానం కలగకపోవడంతో ఆయన ఈశ్వరుడిని ప్రార్థించాడట. దీంతో సంతానం కలిగిందని చెబుతారు. శ్రీకృష్ణుడికి అష్ట భార్యలు. వారంతా ఒకరోజు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి ఆయనను భర్తగా పొందడం తమ అదృష్టమని అయితే సంతానం లేకపోవడం చాలా పెద్ద లోటు అని తెలిపారట.
ఎన్ని సౌభాగ్యాలు, భోగభాగ్యాలున్నా తల్లి కాని స్త్రీకి సంతానం లేకుంటే గౌరవముండదని కాబట్టి తమకు సంతానం ప్రసాదించాలని శ్రీకృష్ణుడిని వేడుకున్నారట. ఆలోచించిన శ్రీకృష్ణ పరమాత్ముడు శివుడికి తపస్సు చేసి అనుగ్రహం పొందాలని తపోవనానికి బయలుదేరాడట. హిమాలయ పర్వతాల్లో ఉప మన్యువు ఆశ్రమం ఉంది. శ్రీకృష్ణుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి వచ్చిన విషయాన్ని ఉప మన్యువుకు చెప్పగా.. ఆయన శివపంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడట. ఆ మంత్రం జిపిస్తూ శ్రీకృష్ణుడు నిష్టా తపస్సు చేయగా పరమేశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమై నీ వారందరూ సంతానవతులవుతారని వరమిచ్చాడట. అలా శివుని అనుగ్రహంతో శ్రీకృష్ణుడు తండ్రి అయ్యాడని కథ.