మండోదరికి వరం ఇచ్చిన శ్రీరాముడు.. ఏం వరమంటే..

మండోదరి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన రావణాసురుడు చివరకు శ్రీరాముని చేతిలో చావును కొని తెచ్చుకున్నాడు. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది.
రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తూ విష్ణువు అవతారమని గ్రహించి, స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది.

తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. విభీషణుడిని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు.. మహా పతివ్రత అయిన మండోదరికి వితంతువు అయ్యే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి. సాధారణంగా ఎటువంటి స్త్రీఅయినా తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే.. భర్త, అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు ఆ దుఃఖానికి అవధి ఉండదు.

Share this post with your friends