
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో కొలువైన దైవం రాజన్న. ఇక్కడి ఆలయంలో నిన్న టి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విపరీతంగా వస్తుండటంతో బ్రేక్ దర్శనాలను కల్పిస్తున్నారు. ఇక ఈ ఆలయం గురించి తాజా అప్‌డేట్ ఏంటంటే.. వేములవాడ రాజన్న ఆలయం నుంచి 27 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్త సీనియార్టీలో భాగంగా మరో ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేయడం జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శి, సూపరిండెంట్ గోలి శ్రీనివాస్‌లను బదిలీ చేశారు.
వేములవాడ రాజన్న ఆలయం నుంచి ఏఈవో 2, పర్యవేక్షకులు 7, సీనియర్ అసిస్టెంట్లు 8, జూనియర్ అసిస్టెంట్లు 10, డిఈ 1 తో కలిపి మొత్తం 27 మంది బదిలీ అయ్యారు. యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం ఆలయాలకు వేములవాడ ఆలయ ఉద్యోగులను బదిలీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో విధుల్లో చేరాలని బదిలీ ఉత్తర్వులలో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆలయంలో ప్రతి రోజూ రెండు సార్లు బ్రేక్ దర్శనం ఉంటుంది. బ్రేక్ దర్శనానికి టికెట్ రూ.300 గా నిర్ధారించారు.
