శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులతో పాటు పిల్లలకు పరీక్ష ఫలితాలు వెలువడం.. ఎన్నికలు ముగియడంతో పెద్ద ఎత్తున తొలుత తిరుమలను దర్శించుకుని ఆ వెంటనే శ్రీకాళ హస్తిని సైతం దర్శించుకుంటున్నారు. గత మూడు రోజుల నుంచి శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేల సంఖ్యలో భక్తులు స్వామి.. అమ్మవార్ల దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలలో బారులు తీరుతున్నారు. శ్రీకాళహస్తి ఆలయం మూడు రోజులుగా పెద్ద ఎత్తున శివనామ స్మరణతో మారుమోగుతోంది. వేసవికాలం సెలవులు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు.
శ్రీకాళహస్తిలోని సువర్ణముఖీ నదీ తీరాన శివయ్య వెలిశాడు. గత మూడు రోజులుగా వేల సంఖ్యలో భక్తులు దోష నివారణ పూజలు చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతికి 36 కి.మీ దూరంలో శ్రీకాళహస్తి ఉంది. పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగం ఇక్కడ ఉంది. ఈ ఆలయాన్ని రాహు-కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడగా.. బయటి ఆలయాన్ని 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ – I .. ఆ తరువాత చోళ రాజులు, విజయనగర రాజులు నిర్మించారు. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు.