ఇకపై కేదారేశ్వరుడు పూర్తిగా నిఘా నీడలో ఉండబోతున్నాడు. ఉత్తరాఖండ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఈ ఆలయ పరిధిలో సెల్‌ఫోన్లు అనుమతించబడవు. ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీసుకోవటంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆలయ సిబ్బంది హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం లేకపోలేదు. ఇటీవల కేదార్‌నాథ్ ఆలయం ఎదుట ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి.. అతనిపై ముద్దులు కురిపించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది.
పసుపు రంగు చీర కట్టుకున్న ఓ మహిళ.. పసుపు రంగు కుర్తా వేసుకుని పంచె కట్టుకున్న ఓ వ్యక్తి కేదారేశ్వరుడికి దణ్ణం పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సదరు మహిల తన వెనుక ఉన్న వ్యక్తికి సైగ చేయడం.. అతనో బాక్సు అందించడం జరిగింది. ఆమె అతని ముందు మోకాలిపై కూర్చొని రింగ్ చూపించి ప్రపోజ్ చేసింది. అతను సర్‌ప్రైజ్ అయ్యాడు. అంతే.. భక్తులందరి ఎదుటే ఇద్దరూ కొగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. ఇది వైరల్ అవడంతో పవిత్ర పుణ్య స్థలం ఎదుట వీరి చర్యలను ఆలయ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆలయ కమిటీ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి చర్యలను ఖండిస్తూ ముందుగా సెల్‌ఫోన్లపై నిషేధం విధించింది. సీసీ టీవీ నిఘాలో ఆలయం ఉందని.. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.