తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠి కుగ్రామం పాలజ్‌లో కొలువైన కర్ర గణనాథుడి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదికి కేవలం నవరాత్రుల సమయంలో 11 రోజులు మాత్రమే ఈ కర్ర గణనాథుడు దర్శనమిస్తాడు. ఈ సమయంలో ఇక్కడికి లక్షల సంఖ్యలో దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. 1948లో తొలిసారి ఈ కర్రగణపతిని విగ్రహాన్ని పాలజ్ మండప నిర్వాహకులు ప్రతిష్టించారు. ఆ ఏడాది గ్రామంలో అంటువ్యాధుల కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతుంటే ఈ కర్ర గణపయ్యను ప్రతిష్టించి మొక్కుకున్నారట.
గుండాజీ వర్మ అనే నిర్మల్ ప్రాంత వాసి ఈ కర్ర గణపతిని చెక్కి ఇచ్చాడట. ఆ తరువాత చిన్న కుటీరంలో కర్ర వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారట. ఇక అప్పటి నుంచి వినాయక చవితి సమయంలో కర్ర గణపతిని 11 రోజుల పాటు పూజించి అనంతరం చక్కగా భద్రపరుస్తారు. మళ్లీ వినాయకచవితికి పూజలు నిర్వహిస్తారు. ఈ గణేశుడు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారిపోయాడు. కర్ర గణపతి అత్యంత అందంగా చూపరులను చూపు తిప్పుకోనివ్వడు. పెద్ద చెవులతో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. ఒక చేతిలో గండ్రగొడ్డలి, మరోచేతిలో త్రిశూలం, ఇంకోచేతిలో లడ్డులతోపాటు కుడిచేతితో ఆశీర్వదిస్తుంటాడు.