శ్రీకృష్ణుడు అక్కడి ఆలయ ముఖ ద్వారాన్ని ఒక తన్ను తన్ని మరీ ఆ గుడి నుంచి వెళ్లిపోయాడట. పైగా తాను తన్నిన చోట గుడి బీటలు వారింది కావాలంటే చూసుకోమంటూ ఓ భక్తుడికి కలలో కనిపించి మరీ చెప్పాడట. అసలు ఎక్కడుందా ఆలయం? కన్నయ్యకు ఎందుకు కోపం వచ్చింది? అలిగిపోయేంత తప్పు ఆ గ్రామస్థులు ఏం చేశారు? అసలు కన్నయ్య అలిగి వెళ్లిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఏం జరిగింది? తెలియాలంటే ఇది చదవాల్సిందే. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామంలో ఉందీ వేణు గోపాల స్వామి ఆలయం. ఎందుకో గానీ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడిని గ్రామస్తులు పట్టించుకోవడం మానేశారు. చూశాడు.. చూశాడు.. ఒకరోజు కన్నయ్యకు ఎంతకాలం పూజల్లేకుండా వదిలేస్తారని కోపం వచ్చింది. అంతే ఆలయ ముఖ ద్వారాన్ని కాలితో తన్ని మరీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
గ్రామస్తులలోని ఒకరికి స్వప్నంలో కనిపించి తాను ఆలయం నుంచి వెళ్ళిపోతున్నానని కావాలంటే రుజువుగా ఆలయ ముఖద్వారం తాను తన్నడంతో గుమ్మం బీటలు వారినట్లుగా ఉంటుందని చెప్పాడట. కన్నయ్య వెళ్లిపోయింది మొదలు గ్రామంలో వర్షాలు లేక కరువుతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారట. పైగా చీకటి పడితే ఆత్మలు తిరుగుతున్నాయన్న భయంతో బయటకు రావడమే మానేశారు. ఇక లాభం లేదనుకున్న గ్రామస్తులు వైభవంగా ఆలయ ప్రాణ ప్రతిష్ట చేసి పుట్టే బిడ్డకు కన్నయ్య పేరే పెట్టుకుంటామని మొక్కారట. ఇక అప్పటి నుంచి గ్రామంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉందట. ఇక ఈ ఆలయం 500 ఏళ్ల క్రితం జనమేజయ మహారాజు నిర్మించారట. గుడి గోపురం నుంచి ద్వారం వరకూ పూర్తిగా రాయితోనే నిర్మించారట. ఆలయ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఇది బాగా ఫేమస్ అయిపోయిందట. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి తరలివస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడిని పూజించి మొక్కితే తప్పని సరిగా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం.