గంగమ్మకు చీర సారెతో జలహారతి..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి శ్రీశైలంలో పర్యటించిననున్నారు. భారీ వరదల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో.. నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలకు చేరుకుంది. దీంతో అధికారులు నిన్న సాయంత్రం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి శ్రీశైలం వెళ్లి ప్రాజెక్టు వద్ద జల హారతి కార్యక్రమం చేపట్టనున్నారు.

గంగమ్మకు చీర సారే సమర్పించి చంద్రబాబు జల హారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీ బ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని దర్వించుకోనున్నారు. జలహారతి కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక నిన్న సాయంత్రం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను దాదాపు 12 అడుగుల మేర ఎత్తారు. 6, 7, 8 గేట్లను ఎత్తి మొత్తంగా 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. శ్రీశైలం గేట్ల ఎత్తివేత విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు పెద్ద ఎత్తున డ్యామ్ వద్దకు చేరుకుని సందడి చేస్తున్నారు.

Share this post with your friends