ఆ కుండంలో నీటితో స్నానమాచరిస్తే కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు పోతాయట..

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్‌లో ఉన్న శివాలయానికి వెళ్లిన వారు ఆశ్చర్యపడే విషయమేంటో తెలుసుకున్నాం కదా.. ఒకవైపు అక్కడి పార్వతి నదిలో గడ్డకట్టే నీరు, మరోవైపు మరుగుతున్న వేడి నీటి బుగ్గ ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. దీనిని చూసిన వారెవరైనా సరే.. అది దేవుడి అనుగ్రహమని నమ్మి తీరాల్సిందే. ఈ ప్రాంతం ఆసక్తికరంగా హిందూ, సిక్కులకు అత్యంత పవిత్ర ప్రదేశమని తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడి ఈ రెండు మతాలకు చెందిన భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇది ప్రతి భక్తునికి మానసిక, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది.

ఇక్కడి వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. శీతాకాలమంతా మంచు కురుస్తుంది.. వేసవిలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి శివాలయంలోని మరుగుతున్న నీటి బుగ్గలన్నీ కలిసి 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఒక ఫౌంటెన్‌ను సృష్టించాయి. ఇక్కడి నీటి బుగ్గల ఉష్ణోగ్రత 65 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. ఈ నీరు ఎందుకంత వెచ్చగా ఉంటుందో తెలుసుకునేందుకు పలువురు శాస్త్రవేత్తలు యత్నించారు కానీ విఫలమయ్యారు. ఇక్కడి నీటిలో ఎలాంటి సల్ఫర్ ఉండదని మాత్రం తేలింది. కాబట్టి ఈనీటితోనే ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఈ కుండంలో స్నానమాచరిస్తే కీళ్ల నొప్పులు, చర్మ సంబంధిత సమస్యలు మాయమవుతాయట. శ్రీరాముడు ఈ ప్రదేశంలో శివుడిని అనేక సార్లు దర్శించుకుని పూజలు చేశాడని చెబుతారు.

Share this post with your friends