మాఘ మాసం విశిష్టతను తెలిపే భృగువు కథ విన్నాం కదా.. ఇప్పుడు భృగు మహర్షి పేరు మీద ఉన్న మహిమాన్విత తీర్థం గురించి కూడా తెలుసుకుందాం. మహర్షి వింద్య పర్వతాల్లో ఎంత కాలం శివుని గురించి తపస్సు చేసినా ఆయన ప్రత్యక్షం కాలేదట. దీంతో తీవ్ర తపస్సును చేయడం ఆరంభించాడట. దీంతో ఆయన చుట్టు పుట్టలు పెరిగాయట. దీంతో భృగు మహర్షిని అనుగ్రహించమని పార్వతీదేవి కోరడంతో శివుడు వృషభ రూపంలో వెళ్లి అతని శరీరంపై ఉన్న పుట్టను తొలగించింది. పుట్టను తొలగించే క్రమంలో భృగువుకు తపోభంగం కలిగింది.
తన తపస్సుకు భంగం కలిగించిందని ఆ వృషభంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో శివుడు తన అసలు రూపంతో ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని భృగువుకు చెప్పాడు. అప్పుడు భృగువు మనిషి చేసే పాపాలను తొలగించే ఒక తీర్థాన్ని తాను తపస్సు చేసిన చోట ఏర్పాటు చేయాలని కోరాడు. అలాగే దానికి భృగు తీర్థమని నామకరణం చేయమని సైతం అర్థించాడు. అప్పుడు శివుడు భృగువు కోరిన విధంగానే తీర్థాన్ని ఏర్పాటు చేసి దానికి భృగు తీర్థమని నామకరణం చేశాడు. అలాగే ఈ తీర్థంలో స్నానం చేసిన వారికే కాక దాని ప్రశస్తి విన్నవారి పాపాలు తొలగుతాయని శివుడు వరమిచ్చాడు.