రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు 11 కి.మీ దూరంలో సముద్రమట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న పుష్కర్ సరస్సు ఒడ్డున ఉన్న బ్రహ్మ దేవుని ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇది ప్రపంచంలోనే బ్రహ్మకు ఉన్న ఏకైక ఆలయం. ఈ ఆలయ స్థలపురాణం ఏంటంటే.. పద్మపురాణం ప్రకారం పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడట. అది చూసిన బ్రహ్మదేవుడు సహించలేక తన చేతిలో ఉన్న తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడు. అలా విసిరినప్పుడు ఆ తామరపూపు నుంచి రేకులు మూడు చోట్ల రాలి, మూడు సరస్సులు ఏర్పడ్డాయి.
ఆ మూడు సరస్సులను జ్యేష్ట పుష్కర్, మధ్యపుష్కర్, కనిష్టపుష్కర్ అని పిలుస్తున్నారు.ఇదంతా ఒక ఎత్తైతే బ్రహ్మదేవుడు తాను భూలోకంలో అడుగిడినప్పుడు తన చేతి నుంచి పుష్పం రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు వచ్చిందట. ఇదొక్కటే కాదు.. రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 400 ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఆప్తేశ్వర్, రంగ్‌జీ, ఏకలింగజీ దేవాలయాలు. వీటిలో రంగ్‌జీ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. దక్షిణ శైలిలో నిర్మించబడిన ఆలయం ఇది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి రంగ్‌జీగా కొలువై ఉంటాడు.