
పరమేశ్వరుడికి బిల్వ పత్రం అంటే ఎందుకు ఇష్టమనే దానికి మనం ఇప్పటికే ఒక కథను చెప్పుకున్నాం. ఇప్పుడు మరో కథ తెలుసుకుందాం. శివుడిని పార్వతి దేవి వివాహం చేసుకోవాలని.. అడవిలో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆ సమయంలో శివయ్యను పార్వతీదేవి బిల్వ పత్రాలతో పూజించేదట. దీంతో సంతోషించిన శివయ్య ఆమెను వివాహం చేసుకున్నాడని చెబుతారు. అప్పటి నుంచి శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే బిల్వ పత్రాలను సమర్పించాలని చెబుతారు. స్కంద పురాణం ప్రకారం పార్వతీదేవి బిల్వ చెట్టు నుంచి పుట్టిందని చెబుతారు. అందుకే మారేడు చెట్టును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
మారేడు చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. అందుకే బిల్వ పత్రాలను శివుడికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి శ్రేయస్సు లభిస్తుందట. బిల్వ పత్రాలను పరమేశ్వరుడికి సమర్పిస్తేనే కాదు.. వాటిని తాకినా, చూసినా కూడా మంచి జరుగుతుందట. బిల్వ పత్రాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా భావిస్తారు. అలాగే బిల్వ పత్రం సత్వ, రజ, తమో గుణాలను కలిగి ఉంటుందని చెబుతారు. బిల్వ పత్రంలోని మూడు ఆకులు.. శివుడి మూడు కళ్లుగా భావిస్తారు. అలాగే బిల్వ పత్రం ఆరోగ్పరంగా కూడా చాలా మంచిదని చెబుతారు. మారేడు ఆకులు శరీరాన్ని చల్లబరుస్తాయట.
