ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. అక్షయ తృతీయ నాడు అంటే మే 10వ తేదీన జరగబోయే ఈ చందనోత్సవం కార్యక్రమానికి లక్షలాది భక్తులు స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించే స్లాట్ల ప్రకారం దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ చందనోత్సవానికి ప్రత్యక్షంగా రాలేని భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటును సైతం చేశారు.
మే 10వ తేదీన చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొన లేని భక్తుల కోసం పరోక్ష సేవ విధానాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. శ్రీ స్వామి వారి చందనోత్సవం రోజున పరోక్ష అష్టోత్తర శతనామార్చిన సేవా సౌకర్యము కోసం www.aptemples.ap.gov.in వెబ్ సైట్ ద్వారా రూ.1116/ ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. వారి పేరిట.. గోత్ర నామాలతో శ్రీ స్వామివారి సన్నిధిలో అష్టోత్తర శతనామార్చన నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి నిర్మాల్య చందనము ప్రసాదముగా ఆయా భక్తులకు పంపిస్తారు. ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు లేని భక్తులకు ఈ సేవా ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వామివారి ప్రసాదము చందనము పొందాలి అంటే ఎంతో ఇబ్బంది పడేవారు.