అయ్యప్ప స్వామివారి దీక్షల సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది ఈ మాసంలోనే అయ్యప్ప దీక్షలను చేపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే అయ్యప్పస్వాములకు ఉచితంగా జీవిత బీమా సదుపాయం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో అయ్యప్ప స్వామిని దర్శించుకునే శబరిమల యాత్రికులకు ఈ ఉచిత బీమా వర్తించనుంది. ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా కవరేజీని పొందనున్నారు.
ఈ ఏడాది శబరిమలకు వచ్చే యాత్రికులందరికీ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పుణ్యక్షేత్రం నిర్వహించే అపెక్స్ టెంపుల్ బాడీ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి వీఎన్ వాసవన్ స్వయంగా తెలిపారు. ఈ దీక్ష తీసుకున్న స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా అనుకోని ఘటనలో మరణిస్తే రూ.5 లక్షల బీమా అందిస్తారు. అంతేకాకుండా ఆ భక్తుడి ప్రభుత్వమే భక్తుడి మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చుతుంది. యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లను చేపట్టినట్టు వాసనన్ తెలిపారు. తీర్థ యాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది.