ఉత్తరాఖండ్.. పురాతన ఆలయాలకు నెలవు. ఇక్కడ అద్భుతమైన.. అబ్బురపరిచే ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చార్దామ్‌లలో ఒకటైన కేదారనాథ్ ఒకటి. ఈ దేవాలయాలలో చెరువులు, సరస్సులు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక ఆసక్తికరమైన.. షాకింగ్ చెరువు గురించి చెప్పుకుందాం. ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే శివ నామస్మరణ చేస్తే చాలు నీరు స్పందిస్తుంది. వేగంగా కదులుతూ ఉప్పొంగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో సరస్వతి నది ఒడ్డున ఉందీ రేటాస్ కుండ్. ఈ చెరువు ఎలా ఏర్పడిందనేది కూడా ఆసక్తికరమే. కామ దేవుడి భార్య రతీదేవి కంటి నీటితో ఈ చెరువు ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి.
అసలు కథ ఏంటంటే.. శివుడి తన మూడో నేత్రం తెరవడంతో కామదేవుడు భస్మమయ్యాడట. దీంతో ఆయన భార్య రతీ దేవి ఏడుస్తూ ఉండేదట. అలా ఆమె కన్నీరు ఓ చెరువుగా మారిందట. అదే రేటాస్ చెరువు. ఇక్కడ శివుడిని భీముడు పూజించాడని చెబుతారు. ఈ చెరువులోని నీటిని సేవిస్తే శివయ్య అనుగ్రహం కలిగి మన కోరికలన్నీ నెరవేరుతాయట. ఇక నీరు ఉప్పొంగడం మాటేంటంటారా? ఎవరైనా సరే శివుడిని స్మరిస్తే వేగంగా కదులుతూ ఉప్పొంగి నీటిపై బుడగలు ఏర్పడతాయట. భక్తులు కోరిక కోరుకుని ఇక్కడ శివుడిని స్మరిస్తే ఈ చెరువులో బుడగలు వస్తే తప్పక కోరిక నెరవేరుతుందట. లేదంటే నెరవేరదట. 2013లో సంభవించిన ప్రకృతి విపత్తులలో కనుమరుగైన కుండాల్లో రెటాస్ ఒకటి. అంతరించి పోయిన తర్వాత కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు.