హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని క్షేత్రంలో కొలువైన వీరభద్ర స్వామి జాతర ప్రతి ఏటా జనవరి 10న జరుగుతుందని తెలుసుకున్నాం కదా. ప్రతి ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా భక్తులు గండాలు తీరాలని గండదీపం, వీరభద్రునికి వెండి, బంగారంతో చేసిన కోరమీసాలు సమర్పిస్తే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. వీరశైవులు ఖడ్గాలు ధరించి ప్రభలు బీరభద్రపల్లెరం చేస్తారు. స్వామి వారిని వైశ్యులు వారి ఇలవేల్పుగా పూజిస్తారు. ప్రతి శ్రావణ మాసంలో వందలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరించి 27 రోజులు దీక్షలు చేపడతారు.
ఇక్కడి వీరభద్రస్వామికి ప్రత్యేక మహిమలు ఉన్నట్లు భక్తుల నమ్మకం. సంతానం లేనివారు స్వామి వారికి కోరమీసాలు సమర్పించుకుంటే తప్పక పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. అందుకే సంతానం లేని వారంతా కోరమీసాలు సమర్పిస్తుంటారు. అలాగే కోడెను కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తులు నమ్మేవారు. కోడెలు కట్టటం, అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తరాలు, అమ్మ వారికి ఒడిబియ్యం, కుంకుమా ర్చనలు, నవగ్రహ పూజలు, ఆంజనేయునికి ఆకుపూజలు, చందనోత్సవాలు మొదలైనవి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.