
ఆషాడ మాసం శుక్ల పక్షం ఏకాదశి తిథి అంటే నిన్నటి నుంచి చాతుర్మాసం ఆరంభమైంది. శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉండే నాలుగు నెలల సమయాన్ని చాతుర్మాసంగా పేర్కొంటారు. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే.. విష్ణుమూర్తితో పాటు పరమేశ్వరుడి ఆశీస్సులు సైతం లభిస్తాయట. ముఖ్యంగా ఈ చాతుర్మాస సమయంలో నిత్యం ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిదట. మరి ఎక్కడ దీపం వెలిగించాలి? ఎక్కడ వెలిగిస్తే మంచి జరుగుతుంది? తెలుసుకుందాం. వాస్తవానికి చాతుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయడం సరికాదని చెబుతారు. ఈ సమయంలో దీపంతో కొన్ని నివారణ చర్యలు సత్ఫలితాన్నిస్తాయట. తులసి మొక్క అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం కాబట్టి చాతుర్మాసం నాలుగు నెలల పాటు నిత్యం దీపం వెలిగించాలి.
దేశీ ఆవు నెయ్యితో నాలుగు నెలల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. ఇలా చేస్తే తప్పక విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఇంట్లో తాగు నీరు ఉండే ప్రదేశంలో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఇంట్లో శ్రేయస్సుతో పాటు ఆనందం నెలకొంటుందట. చాతుర్మాసం సమయంలో ఇంటి వంటగదిలో దీపం వెలిగిస్తే అన్నపూర్ణాదేవి వంట గదిలో నివసిస్తుందట. తద్వారా ఇంట్లోని వారందరికీ ఆహారానికి ఏమాత్రం లోటుండదట. ఆర్థిక ఇబ్బందులు సైతం తొలగిపోయి డబ్బుకు ఎలాంటి లోటూ ఉండదట. అలాగే ప్రతి రోజూ ఉదయం , సాయంత్రం ఇంట్లోని పూజ గదిలో శివయ్య ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన శివుడి ఆశీస్సులతో ఇల్లంతా సుఖ సంతోషాలు నెలకొంటాయట. అలాగే చాతుర్మాసంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట.
