హనుమంతుడి లేని ఊరంటూ ఉండదు. శక్తికి స్వరూపంగా మనం హనుమంతుడిని కొలుస్తూ ఉంటాం. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో హనుమంతుడు కొలవబడుతున్నాడు. ఇక హనుమంతుడి విగ్రహాలు సైతం నిలబడో.. కూర్చొనో.. అదీ కాదంటే వానర రూపంలోనూ ప్రతి ఆలయంలో ఆంజనేయుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఇలా తప్ప మరో రూపంలో హనుమంతుడిని ఆ ప్రాంత వాసులు మినహా మనం చూడలేం. ఇంతకీ ఆ ప్రాంతమేంటి? అక్కడ హనుమంతుడు ఏ రూపంలో దర్శనమిస్తాడు? అంటారా? మీరు ఊహించని రూపంలో స్వామివారు మనకు కనిపిస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని అచల్ సరోవర్ ఒడ్డున ఓ హనుమంతుడి ఆలయం ఉంది. మరి ఇక్కడ హనుమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? ఉడుత రూపంలో ఉంటాడు. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని తొలుత గిల్హారాజ్ శ్రీ మహేంద్రనాథ్ యోగి జీ మహారాజ్ అనే సాధువు గుర్తించారట. దీనికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచంలోనే ఉడుత రూపంలో హనుమంతుడు ఉన్న ఏకైక దేవాలయం ఇది. ఈ హనుమంతుడికి 41 రోజుల పాటు పూజలు నిర్వహిస్తే అన్ని కష్టాలు దూరమవుతాయని అంటారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు స్వామివారికి ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు.