హిందువులకు చెట్లను, నదులను అంతెందుకు ప్రకృతిని పూజించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. పరమేశ్వరుడికి కూడా ప్రకృతి అంటే చాలా ఇష్టమట. కొన్ని రకాల మొక్కలు, చెట్లను పెంచితే శివయ్య చాలా సంతోషిస్తాడట. ముఖ్యంగా శ్రావణ మాసంలో శివయ్యకు ఇష్టమైన మొక్కలు నాటితే చాలా సంతోషిస్తాట. ఆ మొక్కలేంటో చూద్దాం.
బిల్వపత్రం లేదా మారేడు: శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రాన్ని సమర్పిస్తారు. శివుడికి అత్యంత ఇష్టమైన పత్రమిది. ఒక బిల్వపత్రాన్ని శివుడి ముందు ఉంచి పూజ చేసుకున్నా కూడా ఆయన ఎంతో సంతోషిస్తాడట. కాబట్టి శ్రావణమాసంలో శివుడికి అంత ఇష్టమైన బిల్వపత్రం మొక్కను నాటితే చాలా సంతోషిస్తాడట..
శమీ వృక్షం: శమీ వృక్షాన్నే మనం జమ్మిచెట్టు అని కూడా పిలుస్తారు. దసరా పండుగ రోజున మనం తప్పక శమీ పూజ చేస్తాం. పాండవులు వనవాసానికి వెళ్ళేముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద భద్రపరిచారని పురాణం చెబుతోంది. అయితే ఈ జమ్మిచెట్టు ఆకులు కూడా శివుడికి చాలా ఇష్టమట. కాబట్టి శ్రావణంలో ఈ మొక్కను నాటినా కూడా శివుడు చాలా సంతోషిస్తాడట.
ధాతుర మొక్క: ఈ మొక్క పువ్వులంటే శివుడికి చాలా ఇష్టమట. వాస్తవానికి ఇది విషస్వభావం కలిగిన మొక్క. అయినా సరే ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరగడంతో పాటు శత్రువులపై తప్పక విజయం సాధిస్తారట.
జిల్లేడు: రహదారుల పక్కన, గుడులలో విరివిగా జిల్లేడు మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. వీటికి పూసే పువ్వులు శివుడికి చాలా ఇష్టమట. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఇంట సుఖసంతోషాలకు కొదువ ఉండదట.
రుద్రాక్ష: పరమేశ్వరుడి స్వరూపంగా రుద్రాక్షను చూస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిదట. అన్ని విధాలుగా బాగుంటుందట.