ఇడాన్ అమ్మవారి గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ఆరావళి పర్వత శ్రేణుల్లో ఇడాన్ అమ్మవారి ఆలయం ఉంటుంది. నెలలో రెండు మూడు సార్లు ఈ ఆలయం అగ్ని కీలల్లో చిక్కుకుంటుంది. ఆలయమంతా అగ్నికి ఆహుతైనా కూడా అమ్మవారి విగ్రహం మాత్రం చెక్కు చెదరదని చెప్పుకున్నాం. ఈ అగ్ని ఎక్కడి నుంచి పుడుతుందనేది ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియదు. తెలుసుకునేందుకు ఎంత మంది యత్నించినా ఫలితం శూన్యమే. ఇక ఈ అమ్మవారిని ముఖ్యంగా పక్షవాత రోగులు, మతి స్థిమితం లేని వారు, డిప్రెషన్‌తో బాధ పడేవారు దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకుంటే తప్పక ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుందట.
ఇక ఇడాన్ అమ్మవారి ఆలయంలో నెలకు రెండు మూడు రోజులపాటు ఏర్పడే ఈ మంటలను చూసినా కూడా చాలా మంచి జరుగుతుందట. అందుకే మంటలు అలుముకున్నాయని తెలియగానే చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆలయాన్ని అలముకున్న మంటలను చూసినవారికి సకల పాపాలు హరిస్తాయట. అలాగే అదృష్టం వరించడంతో పాటు పుణ్యం దక్కుతుందని అక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయంలో త్రిశూలం కూడా ఉంటుంది. సంతానం లేని వారు ఈ త్రిశూలానికి పూజ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. మంటల కారణంగా ఆలయాన్ని విస్తరించే పనులను స్థానికులు పెట్టుకోలేదట.