ప్రతి స్త్రీ ఇంట్లో ఎక్కువగా గడిపేది వంట గదిలోనే. ఈ వంట గదిలో వంటలు చేస్తూ.. గిన్నెలు తోముతూ.. వంట గదిని శుభ్రం చేస్తూ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేస్తూ ఉంటారు. ఇక ఇంటి సభ్యుల ఆరోగ్యమే కాదు.. ఇంట్లోని సమస్యలు, ఆర్థిక పరిస్థితుల వంటివన్నీ వంట గది పైనే ఆధారపడి ఉంటాయంటారు. అదెలాగంటారా? వంటగదిలో వస్తువులు కొన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారనివ్వకూడదట. అలా చేజారితే ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. గాజు వస్తువులు కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వాస్తు శాస్త్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. గాజు చేజారితే ముక్కలవుతుంది. అది కాలికి గుచ్చుకుని గాయమవుతుంది కాబట్టి గాజు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇక వంటగదిలో పాలు కూడా కింద పడకుండా చూసుకోవాలట. ఇలా పాలు కింద పడటాన్ని దోషంగా పరిగణిస్తూ ఉంటారు. అలాగే పాలు పొంగినా.. కింద పడిపోయినా ఇంట్లోని భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడుతుందట. తద్వారా గొడవలు మొదలవుతాయట. ఆ తరువాత ఉప్పు.. దీనిని చేతికి ఇవ్వడమే కాదు.. వంట గదిలో కింద పడకుండా చూసుకోవాలి. ఉప్పుని లక్ష్మీ దేవికి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఉప్పు కింద పడితే ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయట. వాస్తు ప్రకారం నూనె కూడా కింద పడకూడదట. నూనె అంటే శని దేవుడికి చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. కాబట్టి నూనె కింద పడిపోవడం వల్ల ఇంట్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. కాబట్టి ఇకపై పైన చెప్పుకున్న వస్తువులేవీ కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోండి.