పరమశివుడిని అభిషేక ప్రియుడని అంటారు. చెంబుడు నీళ్లతో అభిషేకించిన చాలు సంతోషిస్తాడట. వ్యాసమహర్షి శివ పురాణంలోనూ శివుడికి అభిషేకం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం దక్కుతుందట. శివుడి అభిషేకంలో పండ్ల రసాలను అలాగే పంచామృతాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఐదింటిని కలిపి పంచామృతాలని అంటారు. పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. శివాభిషేకంలో వాడే అభిషేక ద్రవ్యాలలో ఆవు పెరుగుకు అత్యంత ప్రాధాన్యత ఉంది.
ఆవు పెరుగుతో శివుడిని అభిషేకిస్తే ఆరోగ్యం సొంతమవతుందట. అనారోగ్యాలు దరి చేరవట. ఆవు పెరుగును ఒక వస్త్రంలో మూటకట్టి దానిలోని నీరంతా పోయేలా పిండి, ఆ గట్టి పెరుగుతో శివలింగం తయారు చేయాలి. ఆ శివలింగాన్ని పూజిస్తే సిరిసంపదలు కోరుకునేవారికి తప్పక అవి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దారిద్ర్యం నుంచి వైదొలగాలన్నా కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయాలట. అలాగే గట్టి శివలింగాన్ని పూజించినా కూడా దారిద్ర్యం నుంచి, దాని వలన కలిగే దు:ఖం నుంచి విముక్తి కలుగుతుందట. జన్మాంతర దారిద్ర్యం తొలగిపోయి.. జీవితంలో సిరి సంపదలతో తులతూగుతారని పండితులు చెబుతారు.