
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కోసం ఏమేం ప్రసాదాలు తయారు చేస్తారు? వాటిని తయారు చేసే క్రమంలో నియమాలేంటో కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పించే విధానం గురించి తెలుసుకుందాం. శ్రీవారికి నైవేద్యం సమర్పించే వరకూ బయటి వారెవరూ చూడకూడదని ముందుగానే తెలుసుకున్నాం కదా. ముందుగా గర్భాలయాన్ని శుద్ధి చేసి, గాయత్రీ మంత్రంతో నీళ్లు చల్లుతారు. ప్రసాదాలను మూతపెట్టిన పాత్రల్లో ఉంచుతారు. అర్చకుడు విష్ణు గాయత్రీ మంత్రం జపిస్తూ నెయ్యి, తులసి ఆకులు చల్లుతాడు.
అన్నసూక్తం పఠించి, ముద్దముద్దగా స్వామి కుడి చెయ్యికి తాకిస్తారు. ఇది అన్నసమర్పణ యజ్ఞం, సృష్టిలోని అన్నిరకాల ప్రాణుల ఆకలిని తీర్చే భావనతో చేస్తారు. రోజువారీ భోగాల గురించి తెలుసుకుందాం. ఉదయం – బాలభోగం సమర్పిస్తారు. మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వకేసరి అందిస్తారు. మధ్యాహ్నం – రాజభోగం, శుద్ధాన్నం, పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర/చక్కెర అన్నం. రాత్రి – శయనభోగం, మిరియాల అన్నం, దోసె, లడ్డూ, వడ, శాకాన్నం… ఇక అల్పాహారంగా లడ్డూ, వడ, అప్పం, దోశ సమర్పిస్తారు.
