
పెరటాసి మాసంలో శ్రీనివాసుడికి పిండి దీపాన్ని ప్రతి శనివారం వెలిగిస్తే మంచిదని తెలుసుకున్నాం కదా. ముందుగా దీనికోసం పిండిని ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పిండి దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా తెలుసుకుందాం. ఒక అరిటాకులో మెత్తని పిండిని పెద్ద దీపంలా తయారు చేసుకోవాలి. దానిలో కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి కలిపి మధ్యలో గుంట చేసుకోవాలి. దానిలో అఖండ ఒత్తి వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాల్సి ఉంటుంది. పిండి దీపం వెలిగించిన మీదట
వేంకటేశ్వర స్వామి అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదవాల్సి ఉంటుంది.
పిండి దీపం వెలిగించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం, విష్ణు సహస్రనామం చదివిన మీదట శ్రీనివాసుడికి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా స్వామికి ఇష్టమైన చక్కర పొంగలి, మిరియాల కట్టు పొంగలి సమర్పించి మనసులోని కోరికను స్వామికి చెప్పుకోవాల్సి ఉంటుంది. అనంతరం స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుని గోవింద నామాలు చదువుకోవాలి. ఇక పిండి దీపం కొండెక్కాక ఏం చేయాలో తెలుసా? ఆ దీపాన్ని సైతం ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెరటాసి మాసంలో ప్రతి శనివారం చేయలేకున్నా కూడా ఒక్క మూడవ శనివారం చేసినా చాలు. సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రం చెబుతోంది.
