ఈ నెల 30న సోమవతి అమావాస్య రానుందని తెలుసుకున్నాం కదా. ఈ రోజున చేసే దానధర్మాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ ఏడు రకాల ధాన్యాలను దానం చేయాలి. సోమవతి అమావాస్య రోజున 7 రకాల ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఆ ఏడు రకాల ధాన్యాలు ఏంటంటే.. బియ్యం, గోధుమలు, మినుములు, నల్ల శనగలు, తెల్ల నువ్వులు, పెసలు, మొక్కజొన్న లేదా కాయధాన్యాలు మొదలైనవి ఉన్నాయి. ఇందులో బియ్యం అత్యంత శుభప్రధమట. అలాగే గోధుమలను జీవితానికి ఆధారంగానూ పరిగణిస్తారు. కాబట్టి వీటిని దానం చేసిన వ్యక్తి తన పూర్వీకుల ఆశీర్వాదం పొందుతాడట.
అమావాస్య తిథి రోజున చేసే స్నానం, దానం అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి అమావాస్య తిథి సోమవారం కావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున శివుడిని, పార్వతిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. మన కోరికలన్నీ నెరవేరుతాయట. అమావాస్యతో పాటు సోమవారం అనేది శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల మన కష్టాలన్నీ తీరిపోతాయట. ఇంట సుఖ సంతోషాలు నెలకొంటాయట. అంతేకాకుండా సోమవతి అమావాస్య రోజున పుణ్యస్నానం చేసి పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల పితృదోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.