దశ దానాల్లో ఇప్పటికే ఆరు దానాలు.. వాటిని దానం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చివరి నాలుగు దానాల గురించి తెలుసుకుందాం.
ధాన్య దానం: జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అలాంటి ధాన్యాన్ని దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, ఇహలోకంలో సకలసౌఖ్యాలను అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ దానం: రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. బెల్లం అంటే వినాయకుడు, శ్రీమహాలక్ష్మీకి మహా ప్రీతి. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత దానం: అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివకేశవులు సంతృప్తి చెందుతారు దాతకు సర్వసంపదలు వంశాభివృద్ది అనుగ్రహిస్తారు
లవణ దానం: రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెందుతుంది ఆయుష్షు బలం సంతోషాన్ని అనుగ్రహిస్తారు. వీటిని గ్రహణ సమయంలో చేస్తే దీనికి పడింతల ఫలితం ఉంటుంది. అంతేకాదు దానం భక్తి శ్రద్ధలతో చేయాలి గాని, దాన గ్రహీతకు ఎదో ఉపకారం చేస్తున్నామనే భావనతో గాని నలుగురిలో గొప్పగా చెప్పుకునేటందుకు గాని దానం చేయరాదు, ఒకవేళ అలా చేసినప్పుడు ఎలాంటి ఫలితం దక్కదు.