లోకకళ్యాణం కోసం మహర్షులు యజ్ఞం తలపెట్టారు. అప్పుడు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని అక్కడకు భృగుమహర్షిని పంపుతారు. అరికాలిలో నేత్రం కారణంగా భృగుమహర్షికి గర్వం బాగా ఎక్కువ. తొలుత భృగు మహర్షి సత్యలోకానికి వెళతాడు. అక్కడ బ్రహ్మదేవుడు.. సరస్వతీ దేవి సంగీతాన్ని ఆస్వాదిస్తూ భృగు మహర్షి రాకను గుర్తించడు. దీంతో బ్రహ్మకు భూలోకంలో ఆలయాలుండవని శపించాడు. ఆ తరువాత నేరుగా కైలాసానికి వెళతాడు. అక్కడ శివపార్వతులు నాట్యంలో లీనమై ఉంటారు. దీంతో వీరు కూడా భృగు మహర్షి రాకను గుర్తించరు. దీంతో ఆగ్రహించిన భృగు మహర్షి లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండ రాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు.
వైకుంఠంలో లక్ష్మీనారాయణలు చదరంగం వినోదంలో ఉన్నారు. క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవిలను చూసిన భృగు మహర్షికి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో విచక్షణ మరిచి . కాలెత్తి మహా విష్ణువు వక్షస్థలంపై తన్నాడు. విష్ణుమూర్తికి కోపం రాలేదు. శాంతంగా నవ్వి భృగువుని బుజ్జగించి అతిథి సత్కారాలు చేశాడు. దీనిలో భాగంగా ఆర్ఘ్య పాద్యాలు సమర్పిస్తూ భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిదిమి వేశాడు. అప్పటికి కానీ భృగు మహర్షికి అహంకారం దిగలేదు. చేసిన తప్పు తెలిసి రాలేదు. వెంటనే భృగు మహర్షి పశ్చాత్తాపంతో విష్ణుమూర్తి పాదాలపై పడ్డాడు. అక్కడి నుంచి పశ్చాత్తాపంతో తపోవనానికి వెళ్లిపోయాడు.