దుష్ట శిక్షణ కోసం దేవకి వసుదేవులకు కృష్ణయ్య జన్మించాడు. ఒకరోజు దేవకి మేడమీద గది ముందరున్న విశాల ప్రదేశంలో నిలుచుని ఉండగా.. నీలాకాశం, కదిలే మబ్బుల ఆమెకు ఒక పసివాడి రూపంలో కనిపించాయట. అలా మైమరచిపోయి వినీలాకాశంలో మబ్బులు విడిపోయేవరకూ చూస్తూ ఉండిపోయిందట. ఆ మబ్బులలో చిన్నారి కాళ్లూచేతులు, కళ్లు, మొహం స్పష్టంగా కనిపించాయట. ఆ సమయంలోనే గర్గాచార్యులవారు, వసుదేవుడు అక్కడికి వచ్చారు. ఆమె ఆనందంలో పాలు పంచుకున్నారు.
అప్పుడే కులగురువులు దేవకి-యశోదల ప్రియ సంతాన జాతకాన్ని చూసి.. వారికి పుట్టిన పిల్లవానికి క, చ, ఘ అనే అక్షరాలతో మొదలయ్యే పేరును పెట్టాలని సూచించారట. అలా ఆమె ఊహించిన ఘనశ్యాముడే ఆ పసివాడి పేరుగా పెట్టింది. ఇక ఆ మర్నాడు వసుదేవుడు ఆమెకు మేఘశ్యాముని ప్రతిరూపంగా నల్ల పాలరాతి విగ్రహాన్నివ్వడంతో దేవకి ఆనందానికి అవధుల్లేవట. ఆ విగ్రహానికి ఘనశ్యాముడని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా చూసుకునేదట. ఆ తరువాత గోకులంలో యశోదానందనులు తమ పిల్లవానికి నామకరణం చేయదలచగా కులగురువులు వెళ్లి ‘కృష్ణు’ అని నామకరణం చేశారు.