తాళ్లపాక అన్నమాచార్జుల గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తిరుమల శ్రీనివాసునిపై దాదాపు 32 వేల సంకీర్తనలు రచించాడు అన్నమయ్య. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించాడని చెబుతారు. అందుకేనేమో చిన్ననాటి నుంచి వెంకన్న పేరు తలవనిదే ఉగ్గుపాలు కూడా తాగేవాడు కాదట. ఒకసారి అన్నమయ్య గడ్డి కోసుకురావడానికి వెళ్లగా.. అతని వేలు పొరపాటున తెగి రక్తం కారిందట. దీంతో అన్నమయ్య కళ్లు తిరిగి పడిపోయాడట. తరువాత తాను ఏం పని మీద వచ్చానన్న విషయం మరిచి తిరుమలకు వెళుతున్న భక్త బృందంతో కలిసి నడక సాగించాడట.
అయితే అన్నమయ్యతో ఉన్నవారంతా కొండెక్కారు కానీ అన్నమయ్య మాత్రం ఎంత ప్రయత్నించినా కొండ ఎక్కలేకపోయాడట. అహారం, నీళ్లు లేక అలసిపోయి సొమ్మసిల్లి పడిపోగా అలివేలు మంగమ్మ కలలో దర్శనమిచ్చి స్వామివారి ప్రసాదాన్ని తినిపించి పాదరక్షలు లేకుండా కొండెక్కమని చెప్పిందట. అలాగేనని పాదరక్షలు వదిలేసి తిరుమల చేరుకున్నాడట. అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి ఆది వరాహ స్వామిని దర్శించుకున్నాడట. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నాడట. అప్పటి నుంచి అన్నమయ్య వైష్టవ మతాన్ని స్వీకరించి కీర్తనలు రాస్తూ తిరుమలలోనే జీవితాన్ని గడిపాడట.