జపమాల అనేది ఒకే మతానికి చెందినది కాదు. బౌద్ధం, హిందూ సంప్రదాయం, జైన సంప్రదాయం, క్రైస్తవం, ఇస్లాం వంటి అనేక మతాల్లో పూసల సరాలను జపం, ధ్యానం కోసం ఉపయోగించారు. అయితే చరిత్రాత్మకంగా స్పష్టమైన పురావస్తు ఆధారాలు ముందుగా బౌద్ధ సంప్రదాయంలో కనిపిస్తాయి. ముఖ్యంగా మహాయాన బౌద్ధంలో మంత్ర జపాన్ని లెక్కించడానికి జపమాల వినియోగం వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందింది. అజంతా, నాసిక్, ఎల్లోరా వంటి గుహల శిల్పాలలో బోధిసత్వుల చేతిలో మాలలు కనిపించడం దీనికి ఉదాహరణ. ముఖ్యంగా అవలోకితేశ్వరుడు ఆరాధనలో మాల వినియోగం ప్రాచుర్యంలో ఉంది.

జపమాలలో 108 పూసలు ఎందుకు ఉంటాయి అనే ప్రశ్నకు బౌద్ధ తత్త్వంలో ఒక లోతైన వివరణ ఉంది. బుద్ధుడు మనిషి అనుభవాన్ని ఆరు ఇంద్రియాలుగా వివరించాడు. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ మరియు మనస్సు. ఈ ఆరు ఇంద్రియాలు మూడు తృష్ణలతో అనుసంధానమవుతాయి. అవి కామ తృష్ణ, భవ తృష్ణ, విభవ తృష్ణ. ఈ విధంగా ఆరు ఇంద్రియాలు మూడు తృష్ణలతో కలిపి పద్దెనిమిది అవుతాయి. ఈ పద్దెనిమిది స్థితులు లౌకిక, ఆధ్యాత్మిక స్వభావం వల్ల ముప్పై ఆరు అవుతాయి. భూత, వర్తమాన, భవిష్యత్తు అనే మూడు కాలాల ప్రభావం వల్ల మొత్తం సంఖ్య 108 అవుతుంది. ఈ 108 మనోమలిన్యాలను అధిగమించడం ధ్యాన సాధన యొక్క లక్ష్యంగా భావించబడింది. అందుకే జపమాలలో 108 పూసలు ఉండటం ఒక ప్రతీకాత్మక సాధనంగా మారింది.
