సుగ్రీవుడికి, రాముడికి మైత్రి కల్పించిన హనుమంతుడు..

రామ రావణ యుద్ధంలో లక్ష్మణ ప్రాణ ప్రదాత హనుమంతుడని శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు. హనుమత్‌ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుమ‌ల‌లో ఘనంగా ముగిశాయి. నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ హనుమంతుడు ప్రతి కార్యాన్ని సున్నితంగా గమనించి ధర్మబద్ధంగా నిర్వహించేవాడని అహోబిల రామానుజ జీయర్ స్వామి తెలిపారు. సుగ్రీవుడికి, రాముడికి మైత్రి కల్పించింది హనుమంతుడని చెప్పారు. హనుమంతుడు దేహ బలం, బుద్ధి బలం కంటే సంస్కార బలం చాలా గొప్పదని నిరూపించాడని స్వామీజీ వివరించారు.

జాపాలి క్షేత్రంలో ఉద‌యం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి భార్గవి బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ హరినాధ బృందం నృత్య కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకూ తిరుప‌తికి చెందిన శ్రీ ప్రస‌న్న ల‌క్ష్మీ బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కూ అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు శ్రీమతి మంజుల బృందం హరికథ గానం చేశారు. మొత్తానికి తిరుమలలో హనుమత్ జయంతి వేడుకల్లో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు భక్తి భావాన్ని పంచాయి.

Share this post with your friends