భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవ వేడుకలు.. ఘనంగా కల్యాణ మహోత్సవం

శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం, పల్లకి సేవ అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో రంగనాథ స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. గోవింద నామ స్మరణతో శ్రీపురం మార్మోగింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కల్యాణోత్సవం తిలకిచ్చేందుకు పోటెత్తారు. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా భక్తులు కోలాటాలు నృత్యాలతో సందడి చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం మాడవీధుల్లో రథోత్సవం కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. గోవిందా అంటూ శ్రీ రంగనాథ స్వామి వ్రతాన్ని భక్తులు లాగుతూ ఆనంద పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట జూనియర్ సివిల్ జడ్జి విజయ్ ఉపాధ్యాయ, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బండారు శ్రీనివాస రెడ్డి, నాగర్ కర్నూల్ సిఐ కనకయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ మండపం కోసం రూ 10 లక్షలు…

500 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీపురం శ్రీ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కూచిపూడి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. తమకు శ్రీ రంగనాధ స్వామి కులదైవంగా ఉన్నారని, ఆలయ ఆవరణలో నిర్మించతలపెట్టిన కల్యాణ మండపం కోసం తన బడ్జెట్ నుంచి రూ 10 లక్షలు నిధులు అందిస్తానని ప్రకటించారు. అదే విధంగా దేవాదాయ శాఖ ద్వారా గతంలోనే గాలి గోపురం నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారని, నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Share this post with your friends