యాదాద్రికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్..

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానంతరం పెద్ద ఎత్తున భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలి వస్తుండటంతో దర్శనం కొంత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు గానూ.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల ఆలయ తరహాలో యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం జరిగింది. మాఢవీధులు, స్వామివారి పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు వంటివన్నీ తిరుమల తరహాలోనే జరుగుతుంటాయి.

ఇక దర్శనాల విషయానికి వస్తే తిరుమల తరహాలోనే వీఐపీ బ్రేక్ దర్శన్‌తో పాటు రూ.150ల శీఘ్ర దర్శనం అమల్లో ఉంటుంది. ఇక మీదట భక్తులు ఆన్‌లైన్‌లో స్వామివారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో yadadritemple.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక డొనేషన్స్ ఇవ్వాలనుకునే భక్తులు సైతం ఈ వెబ్‌సైట్ నుంచి ఇవ్వవచ్చు. దర్శనాల విషయానికి వస్తే.. గంట ముందు దర్శనంతో పాటు.. పూజా కైంకర్యాలకు సైతం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకునే వారు పేరు, గోత్రం సహా పూజా వివరాలు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నంబర్, ఏ తేదీన దర్శనం కావాలనే వివరాలను నింపి టికెట్లను పొందవచ్చు.

Share this post with your friends