జీవితంలో ఏ పెను మార్పైనా ఏదైనా ఒక కారణం వల్లనే జరుగుతుంది అంటారు. ఇప్పుడే కాదు.. దేవతల కాలంలోనూ అలాగే జరిగేది. శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవానికి దేవతలందరితో పాటు శివుడు కూడా వచ్చాడట. ఆయన రాముడితో.. అయోధ్యలో దీనంగా ఉన్న భరతుడిని ఓదార్చాలని.. అలాగే రాముడి తల్లి కౌసల్య, కైకేయి, సుమిత్రలకు నమిస్కరించాలని చెబుతాడు. అలాగే యాగాలు చేయాలని.. వంశ గౌరవాన్ని పెంచాలని.. బ్రాహ్మణులకు దానాలు చేయాలని చూసించాడట. తదనంతరం స్వర్గానికి చేరుకుంటావని రాముడికి శివుడు చెప్పాడట.
ఇక దశరథ మహారాజు సైతం అక్కడకు వచ్చారట. రాముడిని ఆనందంతో కౌగిలించుకుని.. పరమానంద భరితుడయ్యాడట. తాను స్వర్గంలోనూ.. ఇంద్ర లోకంలోనూ విహరించినా కానీ ఇంత ఆనందం కలగలేదని చెప్పాడట. తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం చేయాలనుకోవడం.. ఆనందంగా కైక వద్దకు వెళ్లడం.. కైక వరాలు కోరడంతో పట్టాభిషేకం భగ్నమవడం.. తాను తీవ్ర ఆవేదనకు గురవడం వంటి విషయాలన్నీ తనకు ఎంతగానో గుర్తున్నాయని చెప్పాడట. అయితే పట్టాభిషేకం భగ్నమవడానికి కారణం తొలుత కైక అనుకన్నానని.. కానీ దేవతల కారణంగానే భగ్నమైందని తెలుసుకున్నానని రాముడికి దశరథుడు చెప్పాడు. రావణ సంహారం జరగాలి కనుక దేవతలు ఆనాడు నీ పట్టాభిషేకాన్ని భగ్నం చేశారని వెల్లడించాడు.